: చిక్కుల్లో షీలా దీక్షిత్!... ఢిల్లీ మాజీ సీఎంకు ఏసీబీ సమన్లు!
కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటిదాకా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా సంస్థ; పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. తాజాగా ఆ పార్టీ మరో సీనియర్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏకంగా 15 ఏళ్ల పాటు కొనసాగిన షీలా దీక్షిత్ వంతు వచ్చింది. షీలా అధికారంలో ఉండగా ఢిల్లీ వాటర్ మీటర్ కుంభకోణం వెలుగు చూసింది. ఈ కేసు విచారణ బాధ్యతలు చేపట్టిన ఢిల్లీ ఏసీబీ... షీలాకు సమన్లు జారీ చేసింది. కేసు విచారణలో భాగంగా విచారించదలచామని, ఎక్కడకు రావాలో సూచించాలని కోరుతూ ఆమెకు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాదాపు రూ.341 కోట్ల మేర అక్రమాలు జరిగాయని ఆరోపణలున్న ఈ కుంభకోణానికి సంబంధించి గత శనివారమే షీలాకు నోటీసులు జారీ చేసినట్లు ఏసీబీ తెలిపింది.