: భక్తజన సందోహంతో కిటకిటలాడుతోన్న పూరీ పరిసర ప్రాంతాలు.. రథయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనం
ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది. పూరీ వీధుల్లో బలరామ, సుభద్ర సమేతంగా జగన్నాథుడు దర్శమిస్తున్నాడు. ప్రతి ఏటా ఆషాఢ శుక్ల విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభయ్యే విషయం తెలిసిందే. ఈ యాత్ర 9 రోజుల పాటు కొనసాగనుంది. ఎరుపు, పసుపు రంగు వస్త్రాలతో జగన్నాథుడి రథాన్ని అలంకరించారు. రథయాత్ర సందర్భంగా భక్తజన సందోహంతో పూరీ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. రథయాత్రను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా వచ్చి చేరుకున్నారు. భక్తుల కోసం 30 తాత్కాలిక షెడ్లు, 12 ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 9 వ రోజున ప్రధాన ఆలయానికి రథయాత్ర చేరుకుంటుంది. మరోవైపు హైదరాబాద్ బంజారాహిల్స్ జగన్నాథ ఆలయం నుంచి రథయాత్ర ప్రారంభం కానుంది. యాత్రలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 మీదుగా రథయాత్ర కొనసాగనుంది.