: మాల్యాకు శిక్ష ఖరారు కాలేదు!... ఆగస్టు 4కు విచారణ వాయిదా!


బ్యాంకులకు రుణాలు, జీఎంఆర్ కు బకాయిలు చెల్లించకుండా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ఇప్పుడప్పుడే శిక్ష ఖరారయ్యేలా లేదు. శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతల్లోని జీఎంఆర్ గ్రూప్ నకు మాల్యా ఇచ్చిన రెండు చెక్కులు బౌన్సయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ హైదరాబాదు ఎర్రమంజిల్ లోని థర్డ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణను ఇప్పటికే పూర్తి చేసిన కోర్టు మాల్యాను దోషిగానూ తేల్చింది. అయితే దోషి లేకుండా శిక్షను ఖరారు చేయడం కుదరదన్న జడ్జీ... మాల్యాను ఎలాగైనా తీసుకురావాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కోర్టు జారీ చేసిన వారెంట్లు... సదరు అడ్రెస్ లో మాల్యా లేకపోవడంతో తిరుగుటపాలో కోర్టుకే వచ్చి చేరాయి. ఈ క్రమంలో దోషిగా తేలిన మాల్యా హాజరుకాకున్నా... నిన్నటి విచారణలో కోర్టు ఆయనకు శిక్ష ఖరారు చేస్తుందన్న వాదన వినిపించింది. అయితే నిన్న కూడా న్యాయమూర్తి గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డారు. దోషి లేకుండా శిక్ష ఖరారు చేయలేమన్న న్యాయమూర్తి... కేసు తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేశారు. అప్పటిలోగానైనా మాల్యాను తమ ముందు హాజరుపరచాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News