: నజ్మా స్థానం పదిలం!... నఖ్వీకి నిరాశ!
ముక్తార్ అబ్బాస్ నఖ్వీ... హిందూత్వ పార్టీగా పేరుపడ్డ బీజేపీలో మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నేత. పార్టీపై విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టడంలో ఆయనకు ఆయనే సాటి. మంచి వాక్చాతుర్యం కలిగిన నఖ్వీకి కేంద్ర కేబినెట్ లోకి ఎంట్రీ ఖాయమేనన్న వాదన నిన్నటిదాకా వినిపించింది. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన నాడే నఖ్వీకి మంత్రి పదవి ఖాయమన్న వాదనా లేకపోలేదు. అయితే నాడు నఖ్వీకి అవకాశం దక్కలేదు. మైనారిటీ వర్గానికే చెందిన పార్టీ సీనియర్ నేత నజ్మా హెప్తుల్లాకు ఛాన్సిచ్చిన మోదీ... నఖ్వీకి తదుపరి అవకాశం ఇస్తారని హామీ ఇచ్చినట్లు వార్తలు వినిపించాయి. నిన్నటి కేబినెట్ విస్తరణపై వినిపించిన ఊహాగానాల్లో... నజ్మాకు ఉద్వాసన పలకనున్న మోదీ... నఖ్వీని తన కేబినెట్ లోకి చేర్చుకుంటారని అంతా అనుకున్నారు. అయితే ఆ ఊహాగానాలు.. ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. నజ్మాను తప్పించేందుకు ఇష్టపడని మోదీ... నఖ్వీకి కూడా అవకాశం ఇవ్వలేకపోయారు. రానున్న యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ ఈ తరహా వ్యూహాన్ని అమలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వయోభారంతో ఉన్న నజ్మాకు ఉద్వాసన మైనారిటీ వర్గాల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తుందన్న భయంతో మోదీ ఆమెను తప్పించలేకపోయారు. ఈ క్రమంలోనే నఖ్వీని ఎలాగైనా మంత్రివర్గంలోకి చేర్చుకోవాలన్న మోదీ తన నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు.