: వెంకయ్య వల్ల పని కావడం లేదని... పార్లమెంటరీ వ్యవహారాలు అనంత్ కుమార్ కు బదిలీ!


నిన్నటి కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా తెలుగు నేలకు చెందిన కీలక రాజకీయవేత్త ముప్పవరపు వెంకయ్యనాయుడుకు దాదాపుగా ప్రమోషన్ దక్కినట్లే. ఇప్పటికే పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖలతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా నిన్న ఆయన చేతికి మరో కీలకమైన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా చిక్కింది. అయితే అదే సమయంలో ఆయన చేతిలోని పార్లమెంటరీ వ్యవహారాల శాఖను మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ లాగేశారు. దానిని పార్టీ సీనియర్ నేత, మృదు స్వభావిగా పేరున్న అనంత్ కుమార్ కు అప్పజెప్పారు. అయినా విపక్షాలను సభలో ఒంటి చేత్తో నిలువరిస్తున్న వెంకయ్యనాయుడు నుంచి ఆ శాఖను తప్పించాల్సిన అవసరమేమిటన్న వాదన కూడా వినిపిస్తోంది. జీఎస్టీ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ చేయని యత్నం లేదు. నేరుగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రితోనే ఈ విషయంలో ఆయన చర్చలు జరిపారు. అంతేకాకుండా లోక్ సభలో ఎప్పుడో ఆమోదం లభించిన ఈ బిల్లుకు, రాజ్యసభలో మోదీ సర్కారుకు మెజారిటీ లేనందున ఆమోదం లభించడం లేదు. దాంతో అక్కడ ఇది పెండింగులో ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు ససేమిరా అంటున్నాయి. ఈ వ్యవహారంలో విపక్షాలను తమ దారికి తెచ్చుకునేందుకు అటు నరేంద్ర మోదీతో పాటు ఇటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో ఉన్న వెంకయ్యనాయుడు కూడా యత్నిస్తున్నా ఫలితం రావడం లేదు. సభలో విపక్షాలపై వెంకయ్యనాయుడు విరుచుకుపడుతున్న తీరుతోనే ఆ పార్టీలు మోదీ సర్కారు నిర్ణయానికి మొండికేస్తున్నాయని ఓ వాదన వినిపిస్తోంది. ఈ వాదనను ఆసరా చేసుకున్న మోదీ... పార్లమెంటరీ వ్యవహారాల శాఖను వాగ్ధాటి ఉన్న వెంకయ్య నుంచి మృదు స్వభావిగా పేరున్న అనంత్ కుమార్ కు బదిలీ చేశారట. అంటే కేవలం వాగ్ధాటితో దూకుడుగా వ్యవహరిస్తున్నందునే... వెంకయ్య చేతిలో నుంచి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ జారిపోయిందన్న మాట!

  • Loading...

More Telugu News