: యూపీఏ హామీకి ఎన్డీఏ కార్యరూపం!... కర్నూల్లో రైల్వే బోగీల వర్క్ షాప్ కు గ్రీన్ సిగ్నల్!


రాయలసీమ ముఖద్వారం కర్నూలులో రైల్వే బోగీల వర్క్ షాప్ పెడతామని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు ప్రకటించింది. కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి హోదాలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి నాడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ప్రాజెక్టును ప్రకటించుకున్నారు. అయితే దీనిని కార్యరూపంలోకి తేవడంలో మాత్రం ఆయన సఫలం కాలేకపోయారు. ఈ లోగా గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి, బీజేపీ గెలుపు నేపథ్యంలో యూపీఏ సర్కారు గద్దె దిగగా... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు అధికారం చేపట్టింది. రెండేళ్లు గడిచిపోయాయి. అయినా కర్నూలులో బోగీల వర్క్ షాప్ పై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తాజాగా వర్క్ షాప్ ఏర్పాటుకు సంబంధించి కీలక అడుగు పడింది. కర్నూలు జిల్లాలోని ఏపీ రాష్ట్ర సరిహద్దు... పాలమూరు జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు నాడే అంగీకారం కుదిరింది. ఇందుకు అవసరమైన 283 ఎకరాల భూమిలో మెజారిటీ భాగం కర్నూలు జిల్లాలో ఉండగా... కేవలం ఓ 20 ఎకరాలు మాత్రం తెలంగాణ పరిధిలోని పాలమూరు జిల్లాలో ఉంది. ఈ భూమి కోసం ఏపీ రాసిన లేఖకు మొన్నటిదాకా స్పందించని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సానుకూలత వ్యక్తం చేసిందట. దీంతో ప్రాజెక్టుకు ఉన్న కీలక అడ్డంకి తొలగిపోగా... ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకి తొలగిపోవడంతో వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ పనులకు సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ కూడా సిద్ధమైంది. ఈ టెండర్ ఖరారు కాగానే పనులు మొదలు కానున్నాయి. వెరసి కర్నూలు జిల్లాకు యూపీఏ సర్కారు ఇచ్చిన హామీని ఎన్డీఏ సర్కారు అమలు చేస్తున్నట్లైంది.

  • Loading...

More Telugu News