: కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్న గవర్నర్!.. చంద్రబాబుతో భేటీకి బెజవాడకు పయనం!
తెలుగు రాష్ట్రాల మధ్య చోటుచేసుకుంటున్న వివాదాలను పరిష్కరించేందుకు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేయని యత్నమంటూ లేదు. గవర్నర్ చొరవతోనే ఎడమొగం పెడమొగంగా ఉంటున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు పలుమార్లు భేటీ అయ్యారు. తాజాగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజనపై ఇరు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం కూడా చేతులెత్తేసింది. సమస్య మీదేగా.. మీరే పరిష్కరించుకోండి అంటూ ఉచిత సలహా పడేసి చోద్యం చూస్తోంది. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు రోజుల తరబడి ఆందోళనలు చేశారు. ఈ సమస్యను పరిష్కరించే నిమిత్తం గవర్నర్ నరసింహన్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గవర్నర్ పిలిస్తే... విజయవాడలో ఉంటున్న ఏపీ సీఎం చంద్రబాబు ఉరుకులు పరుగుల మీద హైదరాబాదులో వాలిపోతారు. అయితే సమస్య పరిష్కారమే లక్ష్యంగా భావించిన ఆయన ప్రొటోకాల్ ను పక్కనబెట్టేశారు. చంద్రబాబుతో భేటీ కోసం తానే విజయవాడకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. నేటి ఉదయం ఆయన విజయవాడకు వెళుతున్నారు. స్వయంగా గవర్నర్ ప్రొటోకాల్ పక్కనబెట్టి వస్తుండటంతో చంద్రబాబు వైపు నుంచి మరింత సానుకూలత వ్యక్తం కానుందన్న వాదన వినిపిస్తోంది. వెరసి సమస్య పరిష్కారం పేరిట నరసింహన్ సరికొత్త సంప్రదాయానికి తెర తీస్తున్నారు.