: రాజధాని పేరుతో రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు: శైలజానాథ్


రాజధాని పేరుతో ప్రజలను మభ్యపెట్టి సింగపూర్ కి దాసోహమంటున్నారని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు సింగపూర్ కి తాకట్టుపెట్టడం ద్వారా స్వాతంత్ర్యం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అంటే బహుళ అంతస్తుల భవంతులే కాదు, పార్కులే కాదు, రాజధాని అంటే పరిపాలన అని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అంటే రాష్ట్రానికి ఆయువుపట్టు అని, అనేక రహస్యాలు రాజధానిలో దాగి ఉంటాయని, ఇలా విదేశాలకు తాకట్టుపెట్టడం ద్వారా వాటికి ఎలా రక్షణ కల్పిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కీలకమైన రాజధానిని విదేశాల చేతుల్లో పెట్టడమేంటని ఆయన నిలదీశారు. అలాగే రాజధాని నిర్మాణంలో కీలకంగా వ్యవహరించే సీఆర్డీయే వ్యవస్థపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సీఆర్డీఏ ఛైర్మన్ గా నిర్ణయం తీసుకున్న ఫైలుపై సంతకం చేసి, దానిని సీఎం పేషీకి మీరే పంపిస్తారు... మళ్లీ దానిని ఆమోదిస్తూ మీరే సంతకం చేసి ఖరారు చేస్తారు... ఇదే రకమైన పరిపాలన?' అని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. ఈ ఒక్కటీ చాలదా? మీ లోగుట్టు బయటపెట్టడానికి...మీ హృస్వ దృష్టికి, మీ తప్పుడు ఆలోచనలకి ఈ సంఘటన నిదర్శనం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ప్రజలను ఎందుకు మోసం చేస్తారని ఆయన అడిగారు.

  • Loading...

More Telugu News