: ఐఎస్ఐఎస్ చీఫ్ తో నాలుగు సార్లు సమావేశం నిర్వహించిన హైదరాబాదీ ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు... సమాచారం రాబట్టిన ఎన్ఐఏ


హైదరాబాదులో పట్టుబడిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల నుంచి కీలక సమాచారాన్ని ఎన్ఐఏ అధికారులు రాబట్టారు. ఆ సమాచారం ఆధారంగా హైదరాబాదు, పాతబస్తీలోని తలాబ్ కట్టా, బార్కాస్ ఏరియాల్లో సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులు హబీబ్, ఇబ్రహీం ఇచ్చిన సమాచారంతో నిర్వహించిన ఈ సోదాల్లో భాగంగా అధికారులు 17 బుల్లెట్లు, 2 కంప్యూట‌ర్లు, 2 స్కాన‌ర్లు స్వాధీనం చేసుకున్నారు. తలాబ్ కట్టా 'మీసేవా' కేంద్రం నుంచి వీరు ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ అల్ బాగ్దాదీతో నిత్యం ఆన్ లైన్ లో మంతనాలు సాగిస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు కనుగొన్నారు. నాలుగు నెలల్లో నాలుగు సార్లు అబూ అల్ బాగ్దాదీతో ఈ తీవ్రవాదులు ఆన్ లైన్ ద్వారా సమావేశమైనట్టు అధికారులు తెలిపారు. రంజాన్ సందర్భంగా భారీ విధ్వంసానికి పాల్పడాలని ప్రణాళిక రచించుకున్నారని అధికారులు గుర్తించారు. ఇందులో నలుగురు తీవ్రవాదులు కీలక బాధ్యతలు నిర్వర్తించినట్టు వారు తెలుసుకున్నారు. ఈ నలుగురి పేర్లను మార్చిన అల్ బగ్దాదీ...మారు పేర్లతోనే వారిని పిలిచేవాడు. దీంతో నిఘా వర్గాలకు సులువుగా పట్టుబడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రిజ్వాన్ పేరును అబూహసన్ గా మార్చిన అబూబకర్, అతనికి అకౌంట్స్ విభాగం అప్పగించాడు. దీంతో బ్యాంకు ఖాతాల నిర్వహణను రిజ్వాన్ చూస్తున్నాడు. ఇబ్రహీం పేరును అబ్దుల్ రెహ్మాన్ గా మార్చిన బాగ్దాదీ అతనికి కమ్యూనికేషన్ బాధ్యతలు అప్పగించాడు. దీంతో తమ అధినేత అందించిన సమాచారం ఇతరులకు అందజేయడం, వారి నుంచి అధినేతకు సమాచారం చేరవేసేవాడు. మరో ఉగ్రవాది ఇలియాస్ పేరును అబూ మన్సూర్ గా మార్చిన అల్ బగ్దాదీ మత బోధనల ద్వారా ఐఎస్ఐఎస్ ను బలోపేతం చేసే బాధ్యతలు అతనికి అప్పగించాడు. మత బోధనల ద్వారా ఐఎస్ఐఎస్ పట్ల యువకులను ఉగ్రవాదం వైపు మరల్చాలని అతనికి సూచించాడు. చివరిగా హబీబ్ పేరును అబూ షాహిబాగా మార్చిన బగ్దాదీ ఆయుధాల బాధ్యతను అతనికి అప్పగించాడు. ఇతనికి బాంబులు నేర్పే బాధ్యతను కర్ణాటకలోని భత్కల్ నుంచి పారిపోయి ఐఎస్ఐఎస్ పంచకు చేరిన వ్యక్తికి అప్పగించాడు. రంజాన్ వేడుకల్లో మునిగి ఉన్న సందర్భంలో భారీ పేలుడుకు పాల్పడి, కాల్పులు జరపాలని వీరికి ఆదేశాలు అందాయి. ఆ దిశగా తీవ్రవాదులు ప్రయత్నాల్లో ఉన్నవేళ ఎన్ఐఏ అధికారులు వారి కుట్రను భగ్నం చేశారు.

  • Loading...

More Telugu News