: రాజకీయ జీవితం ముగిసిపోయిందనుకొని ఆనాడు ఉద్వేగపూరిత ప్రసంగం.. నేడు మోదీ మంత్రివర్గంలో చోటు... అహ్లువాలియా ప్రస్థానం!
డార్జిలింగ్ లోక్‌సభ ఎంపీ సురేంద్రజిత్ సింగ్ అహ్లువాలియా.. నాలుగేళ్ల క్రితం ఇక తన రాజకీయ జీవితం ముగిసిందనుకున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆనాడు రాజ్యసభలో తన చివరి ప్రసంగంలా ఉద్వేగపూరితంగా మాట్లాడారు. కానీ అనంతరం లోక్‌సభ ఎంపీ అయ్యారు. అంతేకాదు, తాజాగా మోదీ కేబినెట్‌లో చోటు సంపాదించారు. సురేంద్రజిత్ సింగ్ కు బీజేపీ నేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్‌కి మంచి సన్నిహితుడు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయనకు సుష్మాస్వరాజ్, గడ్కరీల మధ్య విభేదాల కారణంగా అప్పటికే నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికైన సురేంద్రజిత్ సింగ్ కు మరోసారి టిక్కెట్ ఇవ్వడానికి బీజేపీ అధిష్ఠానం నిరాకరించింది. నాలుగేళ్ల క్రితం ఆయన రాజ్యసభలో పార్టీ ఉపనాయకుడు. తనకు మరోసారి టిక్కెట్ దొరకనందుకు ఆయన బాధపడ్డారు. దీంతో ఇక అదే తన చివరి ప్రసంగం అనేలా రాజ్యసభలో ఉద్వేగభరితంగా మాట్లాడారు. పట్నాలోని తన స్వగృహంలో ఇక తన జీవితాన్ని గడపనున్నట్లు ఆయన ప్రకటించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడు జైట్లీతో పాటు ఆయన రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సురేంద్రజిత్ సింగ్ అహ్లువాలియా రాజకీయ జీవితం పశ్చిమబెంగాల్‌లో ప్రారంభమైంది. స్టూడెంట్ యూనియన్ లీడర్‌గా ఆయన మంచి పేరుతెచ్చుకున్నారు. దీంతో 1986లో కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ అహ్లువాలియాను రాజ్యసభకు నామినేట్ చేశారు. రాజీవ్ గాంధీ వద్ద మంచి పేరుతెచ్చుకొని ఆయనకు విధేయుడిగా పిలవబడ్డారు. రాజీవ్ గాంధీ మరణం అనంతరం అహ్లువాలియా సోనియా గాంధీ పట్ల కూడా విధేయత కనబర్చారు. అనంతరం ఆయన 1995లో పీవీ నర్సింహారావు మంత్రివర్గంలో చేరారు. కానీ ఆ తరువాత కాంగ్రెస్ పార్టీతో ఆయనకు విభేదాలు చెలరేగి 2000లో బీజేపీలో చేరారు. అనంతరం 2014లో బీజేపీ నుంచి టిక్కెట్ సంపాదించి డార్జిలింగ్ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో విజయం ఆయనను వరించింది. ఈరోజు మోదీ వర్గంలో ఆయన చేరారు.