: కేంద్రం పరిష్కరించలేని సమస్యకు ‘వర్షం’ చెక్!... కృష్ణా జలాల పంపిణీపై కుదిరిన అంగీకారం!
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల్లో ఓ వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కృష్ణా జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాలు కేంద్రాన్ని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కేంద్రం పరిష్కరించలేని ఈ వివాదాన్ని ప్రకృతి పరిష్కరించేసింది. ఎగువ రాష్ట్రాలతో పాటు ఇరు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కృష్ణా నది జలకళ సంతరించుకుంది. వరద పోటెత్తే పరిస్థితి కూడా కనిపించింది. ఈ క్రమంలో జాగ్రత్తగా వ్యవహరించకుంటే అందుబాటులోకి వచ్చే నీరంతా వృథా అయ్యే ప్రమాదముందని ఇరు రాష్ట్రాల అధికారులు భావించారు. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, తెలంగాణ భారీ నీటి పారుదల ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ లు హైదరాబాదులో నేటి ఉదయం భేటీ అయ్యారు. వాస్తవ పరిస్థితిపై సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వాటాల కోసం తగవులాడుకుంటే వచ్చే లాభమేమీ లేదన్న భావనతో గతేడాది పాటించిన దామాషా పద్ధతిలోనే ఈ ఏడాది కూడా కృష్ణా నీటిని పంచుకోవాలని నిర్ణయించారు. ఈ విషయంలో సెంట్రల్ ఎక్స్ పర్ట్ కమిటీ ఎలాంటి ఆదేశాలు జారీ చేసినా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరువురు ప్రకటించారు. అంతేకాకుండా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమంటూ కూడా వారిద్దరూ ఓ అంగీకారానికి వచ్చారు.