: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతోన్న వరదనీరు.. గ్రామాలు ధ్వంసమవుతోన్న వైనం
భారీ వర్షాల ధాటికి ఉత్తరాఖండ్ జలమయమయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాలకి గ్రామాలే ధ్వంసమవుతున్నాయి. ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అక్కడి ఛమోలీ ప్రాంతంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. నదులు పొంగిపొర్లుతుండడంతో వరదలకు అనేక గృహాలు నేలమట్టమయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి రోడ్లు సైతం దెబ్బతినడంతో రవాణా సౌకర్యాలు స్తంభించిపోయాయి. భారీ ఎత్తున ఇళ్లలోకి చేరుతున్న నీటిని పైపుల సాయంతో బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో వరదలకు ప్రజలు కొట్టుకుపోతోన్న ఘటనలు కనిపిస్తున్నాయి. వరదల బారిన చిక్కుకున్న ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిత్యావసర సరుకులు, తాగు నీరు అందిస్తున్నాయి. భారీ వర్షాలతో తమ ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందంటూ ఉత్తరాఖండ్ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.