: వింత విషాదం... భార్య మీద పడగా, ఆమెతో పాటు ప్రాణాలు కోల్పోయిన భర్త!
మెట్లెక్కుతున్న భార్య కాలు జారి పడటంతో, ఆమెతో పాటు ఆమె భర్త కూడా మరణించిన వింతైన విషాదమిది. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్ కోట్, కలావడ్ రోడ్డులో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఇక్కడి రామ్ దామ్ సొసైటీలో మంజుల, నట్వర్ లాల్ లు భార్యాభర్తలు. మంజుల సుమారు 128 కిలోల బరువు ఉంటుంది. వీరి కుమారుడు, కోడలు ఆశిష్, నిశాలు పైన ఉన్న ఫ్లోర్ లో ఉంటారు. ఆశిష్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడంటూ, మందులు తీసుకు వెళ్లేందుకు నిశా కిందకు దిగి వచ్చింది. ఆ సమయంలో కోడలితో పాటు కొడుకును చూసేందుకు ఆ జంట కూడా హడావుడిగా మెట్లెక్కుతున్న క్రమంలో మంజుల కాలు జారీ వెనకే వస్తున్న భర్తపై పడింది. ఈ ఘటనలో ఇద్దరి తలలకూ తీవ్ర గాయాలు కాగా, ఇరువురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదం నిండింది.