: అమరావతిలో భూ కేటాయింపులకు శ్రీకారం!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు టీడీపీ సర్కారు శ్రీకారం చుట్టింది. రాజధాని కోసం 33 వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించిన ప్రభుత్వం... వెలగపూడి పరిధిలోని కొంత భూమిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి మాత్రమే చర్యలు చేపట్టింది. తాజాగా పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు భూములను కేటాయిస్తూ నిన్న కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం ఆరు సంస్థలకు జరిగిన ఈ భూ కేటాయింపుల్లో మొత్తం 455 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. తమిళనాడు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వేలూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)కు 200 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం, ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు 150 ఎకరాలను కేటాయించింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కు 50, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు 5, తిరుమల తిరుపతి దేవస్థానానికి 25, ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు 25 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూములను కేటాయించింది. ఈ కేటాయింపుల్లో విట్, ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎకరా రూ.50 లక్షల చొప్పున భూములిచ్చిన ప్రభుత్వం, మిగిలిన మూడు ప్రభుత్వ సంస్థలకు ఉచితంగానే భూములిచ్చింది. త్వరలో ఈ భూముల్లో ఆయా సంస్థలు నిర్మాణ పనులను ప్రారంభించనున్నాయి.