: విజయవాడలో ఆలయాల కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న పీఠాధిపతులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పవిత్రమైన దేవాలయాలను తొలగించడం ఏంటని హిందూ ధర్మ పరిరక్షణ సమితి ప్రశ్నించింది. ఆలయాల తొలగింపునకు నిరసనగా విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం తెనాలి రోడ్డులో ధర్మో రక్షతి రక్షితః పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు పీఠాధిపతులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరిగి ఆలయాలను కట్టిస్తామని చెబుతోన్న మాటలను తాము నమ్మబోమని చెప్పారు. ప్రభుత్వ నేతలు ఇస్తోన్న హామీపై నమ్మకం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యలు చేతులు కాలిన తరువాత అకులు పట్టుకున్నట్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘మసీదు కూల్చేటప్పుడు మూడు నెలలు టైం ఇచ్చారు.. ఆ భయం హిందూ దేవాలయాలపై లేదా..?’ అని పీఠాధిపతులు ప్రశ్నించారు. దేవాలయాల కూల్చివేత తమకు తెలియకుండా జరిగిపోయిందంటూ మంత్రులు మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు పీఠాధిపతులు, ఆరెస్సెస్, వీహెచ్‌పీ కార్యకర్తలు, బీజేపీ నేతలు హాజరయ్యారు.