: నరేంద్ర మోదీ కొత్త సహచరులు వీరే!
వచ్చే సంవత్సరంలో పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, మలిదశ నరేంద్ర మోదీ క్యాబినెట్ విస్తరణ రేపు ఉదయం 11 గంటలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్రపతి భవన్ వర్గాలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్లింది. ఇక ఈ దఫా విస్తరణలో కచ్చితంగా మంత్రి పదవులు దక్కుతాయని కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా నేడు బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిశారు. ఒక్కొక్కరినీ పిలిపించుకున్న ఆయన, పొద్దుటి నుంచీ బిజీగా గడుపుతున్నారు. యూపీకి చెందిన ఎంపీ అనుప్రియా పటేల్ తొలుత అమిత్ షాను కలిశారు. దాదాపు పావు గంట పాటు ఆమె అమిత్ తో మాట్లాడి ఆపై వెళ్లిపోయారు. ఆపై గుజరాత్ రాజ్యసభ సభ్యుడు పురుషోత్తమ్ రూపాలాను అమిత్ పిలిపించి చర్చలు జరిపారు. రాజస్థాన్ నుంచి అర్జున్ రామ్ మేఘావల్ కూడా అమిత్ వద్దకు వచ్చారు. వీరు ముగ్గురికీ క్యాబినెట్ పదవులు ఖాయమని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. వీరితో పాటు డార్జిలింగ్ బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలి, మహారాష్ట్రకు చెందిన ఎంపీ రామ్ దాస్ అతేవాల్ లు కొద్దిసేపటి క్రితం అమిత్ షాను కలిశారు. మధ్యాహ్నం తరువాత ఎంపీలు, యూపీలో అధిక ఓటు బ్యాంకున్న బ్రాహ్మణ వర్గ నేతలు మహేంద్ర పాండే, శివ్ ప్రతాప్ శుక్లాలు షాను కలిసే అవకాశాలున్నాయి. ఉత్తరాఖండ్ నుంచి అజయ్ తమ్తా, శివసేనకు చెందిన అనిల్ దేశాయ్ పేర్లు కూడా క్యాబినెట్ కు జత కలిసే వీలుందని సమాచారం. ఇక ఓ అత్యాచార కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ ఎంపీ నిహాల్ చంద్ కు కేంద్ర మంత్రి పదవి నుంచి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ప్రస్తుతం మోదీ క్యాబినెట్ లో 66 మంది మంత్రులుండగా, రాజ్యాంగం ప్రకారం మరో 16 మందికి స్థానం కల్పించే వీలుంది.