: మా అమ్మాయి కేన్సర్‌తో బాధపడుతోంది.. కారుణ్య మరణానికి అనుమతివ్వండి: కోర్టును వేడుకున్న తల్లిదండ్రులు
బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోన్న కూమార్తెను ఎన్ని ఆసుపత్రుల్లో చూపించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే వారి వద్దనున్న డబ్బంతా ఖర్చయిపోయింది. కూలి పని చేసుకుని బతుకు బండిని లాక్కొస్తున్న తల్లిదండ్రులు ఇక అలసిపోయారు. తమ కూతురి కారుణ్యమరణానికి అనుమతినివ్వాలని సదరు తల్లిదండ్రులు ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలోని మదనపల్లి రెండవ అదనపు జిల్లా కోర్టులో న్యాయమూర్తి ఎదుట మొరపెట్టుకున్నారు. ఏడాది కాలంగా బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోన్న తమ కూతురి ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆమెకు వైద్యం చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతోందని మదనపల్లిలోని విజయనగర్ కాలనీ వాసులయిన రాయిపేట నారాయణ, శ్యామల న్యాయమూర్తికి లేఖ ద్వారా తెలిపారు. అయితే, తమ దగ్గర అంత డబ్బు లేదని తమ కూతురి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. తాము తమ కూతురికి వైద్యం చేయించేందుకు ఇప్పటికే బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్‌లలోని ఆస్పత్రుల చుట్టూ తిరిగామని పేర్కొన్నారు. బెంగళూరు ప్రైవేటు ఆస్పత్రిలో తమ కూతురికి చికిత్స చేస్తామన్నారని, అయితే వైద్యానికి రూ.6 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారని తల్లిదండ్రులు పేర్కొన్నారు.