: హైదరాబాద్ ను పూర్తిగా వదిలేది లేదు... కొంతమంది అక్కడే!: చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఉద్యోగులందరినీ పూర్తిగా అమరావతికి షిఫ్ట్ చేయబోవడం లేదని సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. కొంతమందిని అక్కడే ఉంచుతామని తెలిపారు. ఎవరెవరిని అక్కడ ఉంచాలన్న విషయమై మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారు, వయసు పెరిగి పదవీ విరమణకు దగ్గరైన వారు, మానవీయ కోణంలో పరిశీలించి ఎంపిక చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. మొత్తం ఉద్యోగుల్లో 5 నుంచి 10 శాతం మాత్రమే హైదరాబాద్ లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మిగతావారంతా అమరావతికి వచ్చేస్తారని చంద్రబాబు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం వారి సమస్యలను మాత్రమే చూపుతూ, నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న పెను సమస్యల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. రెండు రాష్ట్రాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయని, కేంద్రం కల్పించుకోవాల్సిన సమస్యలూ ఉన్నాయని గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలూ పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలియజేశారు.