: ఈ విషయాన్ని నేనే త్వరలో వెల్లడిస్తాను!... పెళ్లిపై సమంత ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న అక్కినేని కుటుంబానికి ప్రముఖ నటి సమంత ఆ ఇంటికి కోడలిగా వెళుతుందని ప్రచారంలో ఉన్న సంగతి విదితమే. అక్కినేని నాగార్జున తొలి భార్య కుమారుడు నాగచైతన్యతో నిండా ప్రేమలో మునిగిపోయిన సమంత... అతడితో పెళ్లికి కూడా ఓకే చెప్పేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పెళ్లికి అక్కినేని కుటుంబం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, డిసెంబర్ లో వీరిద్దరి పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో ఈ విషయాన్ని నిర్ధారిస్తుందనుకున్న సమంత తనదైన శైలిలో నిన్న ఆసక్తికర వ్యాఖ్యలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ‘‘కారణాలేమిటో నాకు తెలుసు. ఏం చేయాలో, ఎప్పుడు చెప్పాలో కూడా నాకు తెలుసు. ఈ విషయాన్ని నేనే త్వరలో వెల్లడిస్తాను. ఈ విషయం గురించి మాట్లాడుతున్న వారందరికీ ఇదే నా సమాధానం’’ అంటూ సదరు ట్వీట్ లో ఆమె పేర్కొంది. విషయాన్ని నేరుగా చెప్పని సమంత... నాగచైతన్యతో లవ్ ఎఫైర్ పై జరుగుతున్న ప్రచారంపైనే ఈ ట్వీట్ చేసినట్లు సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి అసలు విషయాన్ని ఆమె ఎప్పుడు వెల్లడిస్తుందో చూడాలి.