: రేపే మోదీ కేబినెట్ పునర్ వ్వవస్థీకరణ.. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం


ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు(మంగళవారం) తన కేబినెట్‌ను విస్తరించనున్నారు. ఈ మేరకు నేడు రాష్ట్రపతి భవన్‌కు సమాచారం అందించనున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేబినెట్‌లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి ముఖ్యమైన మంత్రి పదవులను కదిలించే అవకాశం లేదని సమాచారం. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలకు కేబినెట్‌లో చోటు కల్పించాలని ప్రధాని భావిస్తున్నారు. మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి నజ్మా హెప్తుల్లాను దాదాపు పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆమె స్థానంలో ఆమె జూనియర్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీని నియమించనున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి గోరఖ్‌పూర్ ఎంపీ యోగి ఆదిత్యానాథ్, అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్ కెబినెట్‌లో బెర్త్ కోసం పోటీపడుతున్నారు. దశాబ్దకాలంగా యూపీలో అధికారానికి దూరమైన బీజేపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో యూపీ నుంచి ఓ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. ఇక యువజన, క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ అస్సాం ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆయిన మంత్రి పదవి ఖాళీ అయింది. ఈశాన్య రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రామన్ దేకాకు ఆ పదవి దక్కే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణపై మోదీ గత వారం రోజులుగా పార్టీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులతో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. కాగా మరో 24 గంటల్లో విస్తరణపై నెలకొన్న సస్పెన్స్ వీడిపోనుంది.

  • Loading...

More Telugu News