: రేపు తెలంగాణలో విద్యాసంస్థల మూత.. బంద్ ప్రకటించిన టీఎన్‌వీఎస్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం విద్యా సంస్థలు మూతపడనున్నాయి. విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బంద్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ నవనిర్మాణ విద్యార్థి సేన(టీఎన్‌వీఎస్) ప్రకటించింది. కార్పొరేట్ విద్యాసంస్థలు చదువును వ్యాపారంగా మార్చేశాయని, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువుదోపిడీ చేస్తున్నాయని టీఎన్‌వీఎస్ ఆరోపించింది. ఈ సందర్భంగా బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద బంద్ పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు టీకే శివప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేయకుంటే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇంటిని ముట్టడిస్తామని నవతెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్ కుమార్ హెచ్చరించారు.