: ఐపీఓకు రానున్న స్మార్ట్ ఫోన్ కంపెనీ 'ఇంటెక్స్'!


ఇండియాలో మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారుగా ఉన్న ఇంటెక్స్, త్వరలో ఐపీఓకు రానుంది. ఈ విషయాన్ని సంస్థ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మరో స్మార్ట్ ఫోన్ సంస్థ లెనోవోను తాము అధిగమించామని, భవిష్యత్తులో గ్లోబల్ బ్రాండ్ గా ఎదగాలన్న లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించామని బన్సాల్ తెలిపారు. ప్రస్తుతం ఐపీఓకు వచ్చి నిధులను సమీకరించేందుకు బోర్డు డైరెక్టర్ల స్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మెడికల్ టూరిజం, ప్రీమియం హోమ్ డెకార్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల్లో తాము సేవలందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ఐపీఎల్ పోటీలతో భాగస్వామ్యం కావడంతోనే నాలుగో ర్యాంకులో ఉన్న సంస్థ మూడో ర్యాంకుకు ఎదిగిందని తెలిపారు. తాము డీల్ కుదుర్చుకున్న గుజరాత్ లయన్స్ టీమ్ మంచి ప్రతిభను చూపి లీగ్ దశలో టాప్ టీమ్ గా ఎదిగిందని, గత రెండేళ్లలో ఆదాయం 76 శాతం పెరిగిందని ఆయన వివరించారు. కాగా, ఐడీసీ (ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్) గణాంకాల ప్రకారం, గడచిన ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో 24 లక్షల మొబైల్ యూనిట్లను విక్రయించిన ఇంటెక్స్ 9.2 శాతం మార్కెట్ వాటాను కలిగివుంది. ఇక నాలుగో స్థానంలో ఉన్న లెనోవో 8.2 శాతం మార్కెట్ వాటాను కలిగివుంది.

  • Loading...

More Telugu News