: డీఆర్డీవో గన్స్ తో లాభం లేదంటున్న సైన్యం!
కొత్త తరం ఆయుధాల కోసం వేచిచూస్తున్న భారత సైన్యం డీఆర్డీవో ఇచ్చిన 5.56 X 45 ఎంఎం కాలిబ్రీ ఎక్స్ కాలిబర్ రైఫిళ్లను తిరస్కరించింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ గన్స్ కన్నా, మరింత మంచి ఆయుధాలు కావాలని వెల్లడించింది. అధిక వేగం, గురి, శక్తితో ఉండే 7.62 X 51 ఎంఎం తుపాకులు కావాలని కోరుతోంది. హై ఎండ్ వెపన్ సిస్టమ్ కావాలని, సబ్ మెరైన్లలో, హోవిట్జర్లు, హెలికాప్టర్ల నుంచి కాల్పులకు ఈ తుపాకులు సరిపోవని అధికారులు డీఆర్డీవోకు స్పష్టం చేసినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. 7.62 అసాల్ట్ రైఫిల్స్ కోసం త్వరలోనే ప్రపంచ వ్యాప్త టెండర్లు పిలిచే ఆలోచనలో ఉన్నట్టు ఓ సైన్యాధికారి తెలిపారు. కాగా, ఇప్పటివరకూ శత్రువులతో పోరాడాల్సి వచ్చినా, లేక ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చినా 5.56 ఎంఎం రైఫిల్స్ ను సైన్యం వాడుతోంది. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మరింత శక్తిమంతమైన గన్స్ కావాలన్నది సైన్యం అభిప్రాయం. ముఖ్యంగా కాశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో వాడకం కోసం మరింత విధ్వంసం సృష్టించే తుపాకులు అత్యవసరమని భావిస్తున్నారు.