: బతిమిలాడితే, చీకొట్టింది, చీదరించుకుంది: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతిని హతమార్చిన దుండగుడు
ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న ఉద్యోగిని స్వాతిని తానెంతగానో ప్రేమించానని, తొలుత అంగీకరించి ఆపై దూరం పెడుతుంటే తట్టుకోలేక హతమార్చానని నిందితుడు రామ్ కుమార్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులను చూడగానే ఆత్మహత్యాయత్నం చేసిన రామ్ కుమార్, ప్రస్తుతం చికిత్స పొందుతుండగా, పోలీసులు అతని స్టేట్ మెంట్ తీసుకున్నారు. తిరునల్వేలిలోని ఐన్ స్టీన్ ఇంజనీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న రామ్ కుమార్ కు నాలుగు బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్వేషణ నిమిత్తం మూడు నెలల క్రితం చెన్నైకి వచ్చి, ఓ దుస్తుల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. అ దగ్గర్లోనే ఉండే స్వాతిని చూశాడు. తాను ఇంజనీరునని నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. తొలుత నమ్మిన స్వాతి అతనికి కాస్త దగ్గరగానే మెలిగింది. ఆపై అతనో గుమాస్తా అని తెలుసుకుని దూరం పెట్టింది. పదే పదే రామ్ వెంటపడుతుంటే చీకొట్టింది. ఆమె చీత్కారాలు రామ్ లో అహాన్ని పెంచాయి. దీంతో స్వాతిని హతమార్చాలని నిర్ణయించుకుని మూడు రోజుల పాటు పుస్తకాల మధ్య కత్తి పెట్టుకుని తిరిగాడు. గత నెల 24న రైల్వే ప్లాట్ ఫాంపై ఒంటరిగా కనిపించడంతో అడ్డగించాడు. ప్రేమించాలని చివరిసారిగా అడిగాడు. ఆమె కాదనడంతో తాను హత్యకు పాల్పడినట్టు రామ్ కుమార్ ఒప్పుకున్నాడు. అతన్ని మరింత సమగ్రంగా విచారించాల్సి వుందని, అందుకోసం చికిత్స పూర్తి కాగానే చెన్నైకి తీసుకు వెళ్తామని పోలీసులు తెలిపారు.