: బీజేపీ నేత నాగంపై దాడికి యత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలు
బీజేపీ తెలంగాణ నేత నాగం జనార్దన్ రెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు దాడికి యత్నించారు. మహబూబ్‌నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ దగ్గర నాగం మీడియా సమావేశంలో పాల్గొంటోన్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. నాగంకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. అనంతరం ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. తోపులాట జరిగింది. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. తాను తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలతో నాగం వాదించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అవినీతిపై మాత్రమే గళం విప్పుతున్నానని ఆయన అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న ప్రాజెక్టుల్లో జరుగుతోన్న అక్రమాలపై తాను పోరాడతానని ఉద్ఘాటించారు. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ వ్యయాన్ని రూ.35వేల కోట్ల నుంచి 60వేల కోట్లకు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం స్వార్థంతో అర్హత లేని కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పని అప్పగించిందని ఆయన ఆరోపించారు.