: విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం
ప్రభుత్వం ఇష్టానుసారంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ విజయవాడలోని లెనిన్ సెంటర్లో విద్యార్థి సంఘాలు ఈరోజు ఆందోళనకు దిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందే పరిస్థితి లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కళాశాలలు మంచి ప్రమాణాలు కూడా పాటించడం లేదని, వాటిల్లో సౌకర్యాలు సరిగా లేవని విద్యార్థులు ఆరోపించారు. ఆందోళనని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై మండిపడ్డారు. విద్యార్థులకు, పోలీసులకి మధ్య వాగ్వివాదం చెలరేగింది. ఆందోళన చేస్తోన్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.