: ప్రొటోకాల్ పై వైసీపీ ఎమ్మెల్యే గుస్సా!... పదవికి రాజీనామా చేసిన మైదుకూరు ఎమ్మెల్యే!
అధికార పార్టీ ఆదేశాలకు మడుగులొత్తుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమను అధికారులు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేత, కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఫ్యాక్స్, కొరియర్ లో పంపారు. వివరాల్లోకెళితే... గత నెల 20న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ‘ఏరువాక’కు రఘురామిరెడ్డిని ఆహ్వానించిన అధికారులు ఆయన వెళ్లేలోగానే నియోజకవర్గ ఇన్ చార్జీ సుధాకర్ యాదవ్ తో ముగించేశారట. అంతేకాకుండా అంతకుముందు జమ్మలమడుగు నియోజకవర్గంలో సీఎం పర్యటన సందర్భంగానూ అధికారులు ప్రొటోకాల్ ను పక్కనబెట్టేసి వైసీపీ ఎమ్మెల్యేలను అవమానపరిచారట. ఈ రెండు ఘటనలలో తీవ్ర మనస్తాపానికి గురైన రఘురామిరెడ్డి నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. మరి ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారో? లేదో? చూడాలి.