: హైదరాబాద్‌లో మత్తుమందిచ్చి దోచుకుంటోన్న మహిళల అరెస్ట్
మాటల్లో పెడతారు.. మేము ఫలానా వారమని పరిచయం చేసుకుంటారు. సేవలు చేస్తున్నామని చెబుతారు. చివరికి మత్తుమందిచ్చి నగదు దోచేసుకుంటారు. ఒంటిపై ఉన్న బంగారాన్ని కాజేస్తారు. ఇదంతా హైదరాబాద్ నగరంలో మహిళా కేడీలు చేస్తోన్న ఉదంతం. మోసాలకు పాల్పడుతోన్న ఈ మహిళా గ్యాంగ్ ఆటలు కట్టించారు పోలీసులు. హైదరాబాద్‌లోని శంషాబాద్, పహడిషరీఫ్ ప్రాంతాల్లో తియ్యని మాటలు చెప్పి ఆపై మత్తుమందిచ్చి చోరీలకు పాల్పడుతోన్న మహిళా గ్యాంగ్‌లోని ముగ్గురిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. బస్ స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీరు ప్రజలని మోసగిస్తూ డబ్బు కాజేస్తున్నారని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు.