: పెద్ద మనసు చూపిన ముస్లిం మత పెద్దలు!... మసీదు నుంచి ఎన్ఐఏకు దారిచ్చిన వైనం!


భాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసం సృష్టించేందుకు పక్కా పథకం వేసుకుని కూర్చున్న ఐఎస్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్ట్ చేశారు. నగర ప్రజల ప్రాణాలను కాపాడారు. అయితే ఈ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగుచూశాయి. పాతబస్తీకి చెందిన ముస్లిం మతపెద్దలు పెద్ద మనసు చూపకపోయి ఉంటే... ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదులను పట్టుకుని ఉండే వాళ్లే కాదేమో. అయితే ఇస్లాంకు, ఉగ్రవాదానికి ఏమాత్రం పొత్తు లేదని చాటారు పాతబస్తీ ముస్లిం మత పెద్దలు. తాము పవిత్రంగా భావించే మసీదు నుంచే పోలీసులకు దారి చూపించిన మత పెద్దలు ఉగ్రవాదుల అరెస్ట్ లో కీలక భూమికే పోషించారు. వివరాల్లోకెళితే... మొన్న అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదుల్లో ఇద్దరు ఉగ్రవాదులు పాతబస్తీలో పోలీసు దుర్భేద్యమైన మసీదు ఆవల మకాం వేశారు. వారు ఉంటున్న ఇంటికి వెళ్లాలంటే మసీదు నుంచి వెళ్లడమొక్కటే దారి. ఆ ఇంటికి వేరే ఏ మార్గమూ లేదు. అసలే రంజాన్ మాసం. ముస్లిం సోదరులు నిష్టగా ఉపవాసాలు ఆచరించే మాసం. భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకునే సమయం. ఇలాంటి కీలక సమయంలో పాతబస్తీలో పోలీసుల ప్రవేశం, దాడులు చేయడం దాదాపుగా అసాధ్యం. అయినా దాడులు చేయాలంటే భారీ కసరత్తు తప్పదు. అల్లర్లు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదు. అయితే వీటన్నిటికీ భయపడి వెనకడుగు వేస్తే... మరో రెండు, మూడు రోజుల్లో నగరంలో పెను బీభత్సం తప్పదు. ఏం చేయాలన్న సందిగ్ధంలో ఉన్న ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదుల ఇంటికి అడ్డుగోడగా ఉన్న మసీదుకు చెందిన మతపెద్దలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. వెనువెంటనే అక్కడికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు... జరగబోయే పెను విధ్వంసాన్ని ముస్లిం మత పెద్దలకు వివరించారు. మసీదు నుంచి దారి ఇస్తే తప్పిస్తే ఆ విధ్వంసాన్ని ఆపలేమని చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకున్న ముస్లిం మత పెద్దలు సానుకూలంగా స్పందించారు. అంతేకాకుండా మత పెద్దలతో పోలీసుల చర్చలను గమనించిన అక్కడి స్థానిక యువత కూడా ఎన్ఐఏ అధికారులకు మద్దతుగా నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇంకేముంది... బుధవారం తెల్లవారుజామున తొలి నమాజ్ (5 గంటలకు జరిగే ఫజర్ నమాజ్) ముగియగానే ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. సదరు మసీదులో జరిగిన ఈ నమాజ్ కు ఆ ఇద్దరు ఉగ్రవాదులు కూడా హాజరయ్యారు. నమాజ్ ముగించుకుని ఆ ఇద్దరు ఉగ్రవాదులు ఇంటికి చేరుకున్న మరుక్షణమే ఎన్ఐఏ అధికారులు ముస్లిం మత పెద్దల అనుమతితో మసీదు లోని దారి మీదుగానే వారి ఇంటిపై దాడి చేశారు. వారిద్దరిని అరెస్ట్ చేశారు. అప్పటికే ఆ ఇంటిలో వారు దాచిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వెంటనే తమకు సహకరించిన ముస్లిం మత పెద్దలను అక్కడికి పిలిపించి ఉగ్రవాదులు దాచిన పేలుడు పదార్థాలను చూపించారు. ఆ పేలుడు పదార్థాలను చూసి ముస్లిం మత పెద్దలు కూడా షాక్ తిన్నారు. ఎన్ఐఏ అధికారులకు తాము సహకరించకపోయి ఉంటే, పెను విధ్వంసమే జరిగి ఉండేదని ఆందోళనకు గురయ్యారు. మసీదు ద్వారా పోలీసులకు దారిచ్చి మంచి పని చేశామని వారు భావించారు. ఈ మేరకు ఈ మొత్తం ఎపిసోడ్ ను ఎన్ఐఏ అధికారులు ఉగ్రవాదుల రిమాండ్ రిపోర్ట్ లో పూసగుచ్చినట్లు వివరించారు.

  • Loading...

More Telugu News