: విభేదాలతో కోర్టుకెక్కిన జంట.. భార్యను రోజూ ప్రేమించాలని భర్తను ఆదేశించిన కోర్టు!


కుటుంబ సమస్యలతో కోర్టుకెక్కిన దంపతులకు కోర్టు వినూత్న తీర్పు ఇచ్చి కలిపిన సంఘటన ఇండోర్‌లో చోటుచేసుకుంది. ‘‘హాయ్ డార్లింగ్ ఎలా ఉన్నావ్? ఏం చేస్తున్నావ్? ఏంటి విశేషాలు..?" అని రోజూ భార్యను పలకరించడం ద్వారా ఆమె ప్రేమను పొందాలని ఆర్డరేసింది. రమేష్, రాశి(పేర్లు మార్చాం) ఇద్దరూ భార్యాభర్తలు. రమేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. బిడ్డ పుట్టినా గొడవలకు పుల్‌స్టాప్ పడలేదు. దీంతో భర్త తనను ప్రేమించడం లేదని, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడని అతడి నుంచి మనోవర్తి ఇప్పించాలని కోరుతూ రాశి కోర్టు కెక్కింది. కేసును విన్న ఖరగోన్ కోర్టు భార్యాభర్తల మధ్య వివాదానికి ముగింపు పలికేలా తీర్పు చెప్పింది. భార్యను రోజూ ప్రేమించడం ద్వారా విభేదాలకు తావులేకుండా జీవితాంతం కలిసి ఉండొచ్చని పేర్కొంది. ఎలా ఉన్నావు డార్లింగ్.. ఏం చేస్తున్నావ్.. ఈరోజు ఎలా గడిచింది.. లాంటి పలకరింపులతో భార్య మనసు చూరగొనవచ్చని పేర్కొంది. ఇక నుంచి రోజూ భార్యను ఇలాగే పలకరించాలని భర్త రమేష్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశంతో కళ్లు తెరిచిన రమేష్.. తాను ఇక నుంచి భార్యను ప్రేమించడంపైనే దృష్టిసారిస్తానని చెబుతూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. భార్యతో కలిసి ఇంటికి నడిచాడు.

  • Loading...

More Telugu News