: హైదరాబాదు ముమ్మాటికీ నా బ్రెయిన్ చైల్డే: చంద్రబాబు ఉద్ఘాటన
హైటెక్ సిటీగా మారిపోయిన హైదరాబాదు నగరం ముమ్మాటికీ తన బ్రెయిన్ చైల్డేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఇప్పటికే ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావించిన చంద్రబాబు... నిన్న విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ మరోమారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాదులో అభివృద్ధి తన హయాంలోనే జరిగిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఏపీ భవన్ ఉన్న ఏడెకరాల స్థలం కూడా తన చొరవతోనే రాష్ట్రానికి దక్కిందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఢిల్లీలో ఉన్న నిజాం భవనాన్ని కేంద్రం తీసుకుంటే... నేను సీఎంగా, వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు నేను ఆయనతో మాట్లాడి, ఆ భవనానికి బదులుగా ఆ ఏడెకరాల స్థలాన్ని తీసుకున్నాం. అలాంటివి అనవసరంగా వివాదాస్పదం చేయడం సరికాదు. హైదరాబాదు నా హయాంలోనే అభివృద్ధి చెందింది. అది నా బ్రెయిన్ చైల్డ్’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.