: షాకింగ్ న్యూస్! టార్గెట్ హైదరాబాదు కాదు...అనంతపురం, లక్నో, అజ్మీర్, నాందేడ్!
ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్న కొన్ని గంటల్లోనే షాక్ కు గురయ్యే సమాచారాన్ని ఉగ్రవాదుల నుంచి సేకరించారు. ఈ వివరాలు చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. రహస్యప్రదేశంలో విచారిస్తున్న అధికారులకు తమ టార్గెట్ హైదరాబాదు కాదని వారు తెలిపారు. ఒకే సమయంలో నాలుగు రాష్ట్రాల్లో బాంబు పేలుళ్లకు ప్రణాళికలు వేసినట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, ఉత్తరప్రదేశ్ లోని లక్నో, రాజస్థాన్ లోని అజ్మీర్, మహారాష్ట్రలోని నాందేడ్ లలో బాంబుపేలుళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పట్టణాలే వీరికి ఎందుకు లక్ష్యంగా మారాయంటే, దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం కాదని చెప్పడమే తీవ్రవాదుల లక్ష్యమని నిపుణులు చెబుతున్నారు. సిరియాలో ఉంటున్న ఐఎస్ఐఎస్ కమాండర్ షఫీ అర్మార్ ఆన్ లైన్ పర్యవేక్షణలో ఇబ్రహీం తన వంటగదిని ప్రయోగశాలగా మార్చేశాడని ఎన్ఐఏ అధికారులు తెలుసుకున్నారు. దీంతో అత్యంత ప్రమాదకరమైన బాంబులు తయారు చేసే సామర్థ్యాన్ని సంతరించుకోవడమే కాకుండా, 30 బాంబులు తయారు చేసేందుకు అవసరమైన పదార్థాలను కూడా కొనుగోలు చేశారు. ఈ మొత్తం కార్యాచరణకు దుబాయ్ నుంచి కరెన్సీ అందినట్టు తెలుస్తోంది. అలాగే ముగ్గురు రాజకీయ నాయకులు, కీలకమైన నలుగురు పోలీసు అధికారులను హతమార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. తాము టార్గెట్ గా పెట్టుకున్న నాలుగు పట్టణాల్లో బాంబు పేలుళ్లకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలాగే ఆయా ప్రాంతాలకు వెళ్లి ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారు. తప్పించుకునే మార్గాలను అన్వేషించుకున్నారు. ఆయా నగరాల్లో కొంత కాలం మకాం కూడా పెట్టారనే విషయం కూడా తెలిసింది. అలాగే, వీరి గ్యాంగ్ లో ఇంకా మరికొందరు సభ్యులు ఉన్నారన్న అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. దీంతో అధికారులు ఆయా ప్రాంతాలకు వీరిని తీసుకెళ్లనున్నారు.