: తెలంగాణ న్యాయవాదుల ఆందోళన సరైందే!: ప్రొ.కోదండరాం
తెలంగాణ న్యాయవాదులు చేస్తోన్న ఆందోళన సరైందేనని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద న్యాయవాదులు చేస్తోన్న మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ న్యాయాధికారులకు న్యాయం జరగాలని అన్నారు. న్యాయాధికారుల కేటాయింపు నిర్ణయాన్ని తొందరపాటు నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. కోర్టు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని కోదండరాం సూచించారు. హైకోర్టు విభజన అనేది తెలంగాణ సమాజం డిమాండ్ అని కోదండరాం స్పష్టం చేశారు. ఉమ్మడి న్యాయ వ్యవస్థలో అప్పట్లో తెలంగాణకు న్యాయం జరగలేదని, ఇప్పుడైనా విభజన చేసి న్యాయం చేకూర్చాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు లేకుంటే సమగ్ర రాష్ట్రం ఏర్పడనట్టేనని ఆయన అన్నారు. న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు విభజన అంశంపై కేంద్రంతో చర్చించాలని ఆయన అన్నారు.