: శాశ్వతంగా రుణపడి ఉంటా: పాదయాత్ర ముగింపు సభలో బాబు


ప్రజానీకం తన పట్ల చూపిస్తున్న అభిమానం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్వేగభరితుణ్ని చేసింది. విశాఖలో ఈ సాయంత్రం జరిగిన పాదయాత్ర ముగింపు సభకు హాజరైన భారీ జనసందోహాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానిస్తూ, తన జీవితంలో ఎన్నడూ చూడని జన స్పందన చూస్తున్నానని బాబు అన్నారు. వారు చూపిస్తున్న అభిమానానికి శాశ్వతంగా రుణపడి ఉంటానని వ్యాఖ్యానించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే పాదయాత్ర మొదలు పెట్టానని వివరించారు. ప్రజలే తనను ముందుకు నడిపించారని కొనియాడారు.

ఒక్కోసారి కాలి నొప్పి తీవ్రంగా బాధించినా, ప్రజల ముందుకు వచ్చేసరికి ఆ బాధంతా మటుమాయమయ్యేదని తెలిపారు. ప్రజల్లో మార్పుకోసమే 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర చేపట్టానని బాబు అన్నారు. ఇక ఇటీవలే మరణించిన ఎర్రన్నాయుడిని బాబు గుర్తు చేసుకున్నారు. కుడిభుజంలాంటి ఎర్రన్నాయుడి మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించారు. పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే విద్యుత్ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అన్ని రాష్ట్రాలకు కరవు నిధులొచ్చినా, మన రాష్ట్రానికి మాత్రం ఇంతవరకు అందలేదని చెప్పారు. దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్టు.. సీఎం చాలా తీరిగ్గా నివేదికను కేంద్రానికి పంపాడని మండిపడ్డారు. సకాలంలో నివేదికను పంపలేని సీఎం ఓ అసమర్థుడని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు, మంత్రులు కేంద్రంలో ఉన్నా ఒరిగిందేమీలేదని బాబు పెదవి విరిచారు.

ప్రస్తుతం రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెబుతూ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం ఇచ్చిన మాట తప్పే పార్టీ కాదని నొక్కి చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి బాబు కుటుంబసభ్యులు భువనేశ్వరి, లోకేశ్, బాలక్రిష్ణ, తెలుగుదేశం నేతలు రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి, లాల్ జాన్ బాషా, కాలువ శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News