: షూ కొనివ్వమన్న కుమార్తెను నదిలో పడేసిన తండ్రి... గుర్రపుడెక్కపై తేలియాడుతూ బతికిన వైనం!
షూ కొనివ్వమని అల్లరి చేసిన కుమార్తెను సముదాయించాల్సిన తండ్రి ఆమెను నదిలో విసిరేసిన ఘటన థానేలోని బద్లాపూర్ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...బద్లాపూర్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న వావిల్లి వంతెన సమీపంలో విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు రమేష్ భోయిర్ కు బాలిక ఏడుపు వినిపించింది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా ఆరేళ్ల బాలిక నదిలో ఏపుగా పెరిగిన గుర్రపుడెక్కపై తేలియాడుతూ ఏడుస్తూ కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి అతను సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది బాలికను రక్షించారు. అనంతరం బాలికను ప్రశ్నించగా, తన పేరు ఏక్తా తులసీరాం సైనీ అని, తనతండ్రే తనను నదిలో పడేశారని సమాధానం చెప్పింది. దీంతో షాక్ కు గురైన పోలీసులు, బాలికను ఆసుపత్రిలో చేర్చి, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరించగా, కొత్త షూ కావాలని మారాం చేస్తున్న సైనీని షూ కొనిపెడతానంటూ తండ్రి, అతని స్నేహితుడితో కలిసి బయటకు తీసుకొచ్చాడు. నది వంతెన వద్దకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి ఆమెను అందులోకి విసేరేశాడు. అయితే నీటిలో గుర్రపుడెక్క ఏపుగా పెరగడంతో బాలిక దానిపై తేలియాడుతూ, రాత్రంతా అక్కడే గడిపింది. తన కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న బాలిక తండ్రి కోసం గాలింపు చేపట్టారు.