: ఎన్ఐఏ అధికారుల కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు!
హైదరాబాదులోని పాతబస్తీలో పట్టుబడ్డ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అడిగినన్ని రోజుల కస్టడీకి నాంపల్లి న్యాయస్థానం అంగీకరించింది. 24 గంటల విచారణ సరిపోలేదని, ఆ విచారణలో వారి నుంచి వివరాలు రాబట్టలేకపోయామని ఎన్ఐఏ అధికారులు నాంపల్లి కోర్టుకు తెలిపారు. వీరి వెనుక చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వారందర్నీ పట్టుకోవాలని స్పష్టం చేశారు. వీరంతా దేశద్రోహానికి పాల్పడ్డారని, ఉపేక్షిస్తే ప్రమాదమని, వీరికి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నిధులు సమకూరుతున్నాయని, ఈ నిధులు ఎలా వస్తున్నాయి? వీరికి సహాయ సహకారాలు అందించిన వారెవరు? వంటి వివరాలు సేకరించాల్సి ఉందని, అందుకోసం వీరిని ముంబై, కర్ణాటక రాష్ట్రాలకు తీసుకెళ్లి విచారణ చేయాల్సి ఉందని ఎన్ఐఏ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. 12 రోజుల కస్టడీకి అప్పగిస్తే వాస్తవాలు రాబడతామని పేర్కొన్నారు. దీంతో ఎన్ఐఏ అధికారుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. వాస్తవాలు వెలికితీయాలని ఆదేశిస్తూ, వారిని 12 కస్టడీకి అప్పగించింది. ఇప్పుడు వారినుంచి మరింత సమగ్ర సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది.