: రాష్ట్ర విభజన సులువుగా అయింది.. హైకోర్టు విభజన మాత్రం ఆలస్యమవుతోంది: ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ఈరోజు చేపట్టిన మహాధర్నా ప్రాంగణానికి భారీ సంఖ్యలో తెలంగాణ న్యాయవాదులు చేరుకున్నారు. హైకోర్టు విభజన, న్యాయాధికారులను సస్పెండ్ చేసిన అంశాలపై నిరసన తెలుపుతున్నారు. న్యాయవాదులు మహాధర్నా చేస్తోన్న ప్రాంగణానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలుపుతోందని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో నిస్సందేహంగా న్యాయవాదుల పాత్ర ఉందని ఉత్తమ్‌కుమార్ అన్నారు. అటువంటి న్యాయవాదులే ఈరోజు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. హైకోర్టు విభజన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండడం శోచనీయం అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సులువుగా అయిందని, హైకోర్టు విభజన మాత్రం ఆలస్యమవుతోందని ఆయన అన్నారు.