: నా తండ్రిని నా కొడుకు కొత్త వ్యక్తిలా చూస్తున్నాడు!: చంద్రబాబు కష్టాన్ని ఏకరువు పెట్టిన నారా లోకేశ్!
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రాత్రింబవళ్లనే తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన కుటుంబ సభ్యులకు కూడా సరైన సమయం కేటాయించలేకపోతున్నారు. తెల్లవారుజామునే నిద్ర లేచి కార్యాలయానికి వెళుతున్న ఆయన అర్థరాత్రి దాటిన తర్వాత కూడా ఇంటికి రావట్లేదు. ఈ కష్టాన్ని ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏకరువు పెట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని తన సొంతూరు నారావారిపల్లెకు నిన్న వెళ్లిన లోకేశ్ కొద్దిసేపటి క్రితం అక్కడికి సమీపంలోని రామచంద్రాపురంలో మహానాడు భోజన కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ, తన కొడుకు దేవాన్ష్ తన తండ్రిని చూసి... కొత్త వ్యక్తిని చూసినట్లు ఏడుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం మనవడిని ముద్దులాడే తీరిక కూడా లేకుండా తన తండ్రి కష్టపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎం హోదాలో సెక్రటేరియట్ కు వెళ్లిన తన తండ్రికి కూర్చునేందుకు కుర్చీ కూడా లేకపోయిందని కూడా లోకేశ్ ఆవేదనాభరిత వ్యాఖ్యలు చేశారు.