: రెండేళ్ల పాటు ఐబీ నిఘా!... భాగ్యనగరిలో పెను విధ్వంసానికి చెక్!
భాగ్యనగరి హైదరాబాదులో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఐఎస్ సానుభూతిపరులుగా భావిస్తున్న ఉగ్రవాదులు దాదాపుగా రెండేళ్లుగా పథక రచన చేస్తున్నారు. దీనిపై నాడే కీలక సమాచారం అందుకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో దానిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. 2014లో ప్రారంభమైన ఈ నిఘా నాన్ స్టాప్ గా కొనసాగింది. అరెస్టైన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లను నిర్ధారణ చేసుకున్న ఐబీ... వారికి సంబంధించిన ప్రతి చిన్న కదలికపైనా పూర్తి స్థాయిలో నిఘా వేసింది. ఏమాత్రం ఏమరపాటు లేకుండా ఉగ్రవాదులు సంచరించిన అన్ని ప్రాంతాల్లో వారి వెంటే నడిచింది. ఉగ్రవాదులకు ఏమాత్రం అనుమానం రాకుండా వారి గూడుపుఠాణికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించింది. అయితే అప్పటికప్పుడే వారిని అరెస్ట్ చేసే అవకాశాలున్నా... సరైన సమయం కోసం ఐబీ చూసింది. ఈ క్రమంలో నగరంలో భారీ విధ్వంసాన్ని సృష్టించేందుకు ఉగ్రవాదుల సన్నాహాలు ముమ్మరమైన క్రమంలో వెనువెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను అప్రమత్తం చేసింది. ఐబీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ గత నెల 22న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాకుండా ఐబీ ఇచ్చిన సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఎన్ఐఏ... ఈ నెల 28న సోదాల కోసం కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. కోర్టు నుంచి అదేరోజు గ్రీన్ సిగ్నల్ రాగా.. ఆ మరునాడు రంగంలోకి దిగిపోయింది. ఎంపిక చేసుకున్న పోలీసు సిబ్బందిని ఏకకాలంలో రంగంలోకి దించిన ఎన్ఐఏ... తాము అనుకున్న ఐదుగురు ఉగ్రవాదులతో పాటు మరో ఆరుగురిని అనుమానితుల కింద అరెస్ట్ చేసింది. అయితే మిగిలిన ఆరుగురికి ఈ ఉగ్ర పథకంలో సంబంధం లేదని తేలడంతో వారిని వదిలేసింది. మిగిలిన ఐదుగురిని కోర్టులో హాజరుపరచింది. వెరసి ఐబీ అధికారులు రెండేళ్ల పాటు పెట్టిన నిఘా.. భాగ్యనగరిలో ఉగ్రవాదుల పెను విధ్వంసాన్ని నివారించింది.