: హైదరాబాదులో నిఘా పెరిగింది... సీసీ కెమెరాలతో పరిస్థితి సమీక్ష!
హైదరాబాదులో నిఘా పెరిగింది. ఐఎస్ఐఎస్ మూలాలు హైదరాబాదులో కనబడడంతో తెలుగు రాష్ట్రాల్లో అలజడి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాదు మొత్తం నిఘా నీడలోకి వెళ్లిపోయింది. పలు ప్రాంతాల్లో పోలీసుల రద్దీ పెరిగింది. సీసీ కెమెరాలతో భద్రతా విభాగాలు అనుసంధానమవుతున్నాయి. నగరంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు భద్రతను సమీక్షిస్తున్నారు. షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. షాపింగ్ మాల్స్ యజమానులకు భద్రతను పటిష్ఠం చేయాల్సిన బాధ్యతను గురించి గుర్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, కోటీ, అమీర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నగర శివార్లలో ఉన్న స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లలో పోలీసులు భద్రత పెంచినట్టు తెలుస్తోంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉగ్రవాదుల వ్యూహాలను పారనివ్వకూడదని భద్రతాధికారులు పటిష్ఠ భద్రతను కల్పిస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రధాన పట్టణాలను కూడా పోలీసులు అప్రమత్తం చేశారు.