: మాయావతికి మరో ఎదురుదెబ్బ... బై చెప్పిన మరో సీనియర్!
బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి మరో షాక్ తగిలింది. బీఎస్పీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఆర్కే చౌదరి పార్టీకి రాంరాం చెబుతున్నట్లు ప్రకటించారు. ఇటీవలే మరో సీనియర్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య బీఎస్పీని వీడిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాయావతికి తమ పార్టీ నుంచి సీనియర్ నేతలు వెళ్లిపోతుండడం పెద్దదెబ్బే. పార్టీకి గుడ్ బై చెబుతూ సదరు సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బీఎస్పీని మరింత ఇరకాటంలోకి నెట్టేసేలా ఉన్నాయి. మాయావతి టిక్కెట్లు అమ్ముకుంటున్నారని, వేలం వేస్తున్నారని పార్టీ వీడిన నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ వీడిన ఇరువురు నేతలూ మాయావతిపై ఇదే ఆరోపణ చేయడం బీఎస్పీని ఇబ్బందుల్లో పెడుతోంది. పార్టీలో మాయావతి సొంత నిర్ణయం తీసుకునే టిక్కెట్లు ఇస్తారని స్వామి ప్రసాద్ మౌర్య వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీ అధినేత్రి పార్టీకి సరైన అభ్యర్థులను ఎంచుకోవడం లేదని ఆయన అన్నారు.