: 11 ఏళ్ల మైనర్ బాలికతో జార్ఖండ్ బీజేపీ చీఫ్ తనయుడి పెళ్లి!
కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పెను వివాదంలో చిక్కుకుంది. కమలం పార్టీకి చెందిన జార్ఖండ్ శాఖ చీఫ్ తలా మరాండీ చేసిన ఈ పని ఆ పార్టీ మెడకు చుట్టుకోనుంది. అయినా మరాండి అంత కాని పని ఏం చేశారనేగా? ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికతో ఆయన తన కొడుకు మున్నా మరాండీకి వివాహం చేశారు. ఈ వ్యవహారంపై గుప్పుమన్న ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి జరిపిన దర్యాప్తులో ఈ విషయం నిజమేనని తేలింది. మున్నా మరాండీ వివాహం చేసుకున్న రితూ బక్షి అనే బాలికకు కేవలం 11 ఏళ్ల వయసు మాత్రమే ఉందట. స్కూల్ రికార్డులను పరిశీలించగా... 2005, జూలై 25న ఆ బాలిక జన్మించిందని తేలింది. ఈ మేరకు ‘నయాదునియా.జగ్రాణ్.కామ్’ ఓ సంచలన కథనాన్ని రాసింది. సదురు బాలికను మున్నా మరాండీ రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు ఆ పత్రిక పేర్కొంది.