: హైదరాబాద్ అమృత విద్యాలయం ముందు తల్లిదండ్రుల ఆందోళన.. అరెస్ట్.. ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని మహేంద్ర హిల్స్ అమృత విద్యాలయం ముందు ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన కొనసాగిస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసినందుకు తమ పిల్లలకు పాఠశాల యాజమాన్యం టీసీలు ఇచ్చి పంపించేసిందని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఫీజుల అంశంపై నెల రోజులుగా పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర వాతావరణమే ఉంది. తల్లిదండ్రులు తమ ఆందోళనని మరింత ఉద్ధృతం చేయడంతో పాఠశాల ముందు పోలీసు బలగాలు మోహరించాయి. నిరసన చేస్తోన్న తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొల్లారం పోలీస్ స్టేషన్‌కి వారిని తరలించారు. తల్లిదండ్రుల ఆందోళనకు పలు ప్రజా సంఘాలు, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు తెలిపారు. పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.