: ప్రసాద్ ఐమాక్స్, అమీర్ పేట బిగ్ బజార్, గచ్చిబౌలీ ఐటీ కంపెనీలు... ఉగ్రవాదుల టార్గెట్!
ఎన్ఐఏ, పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన ఉగ్రవాద బ్యాచ్ టార్గెట్లుగా నక్లెస్ రోడ్ సమీపంలోని ప్రసాద్స్ ఐమ్యాక్స్, అమీర్ పేట బిగ్ బజార్, గచ్చిబౌలీలోని పలు ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన మ్యాప్ లు ఉగ్రవాదుల వద్ద లభించినట్టు వారిని విచారిస్తున్న పోలీసు వర్గాలు వెల్లడించాయి. భవనాల మ్యాప్ లు, వాటిల్లోకి ప్రవేశించే మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, అక్కడ ఉండే జన సంఖ్య తదితర వివరాలు వీరివద్ద ఉన్నాయని తెలిపాయి. ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు, వాణిజ్య సముదాయాలపై దాడులు జరపాలన్నదే వీరి ప్రధాన కుట్రని, అందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్న వీరు సమయం కోసం మాత్రమే వేచి చూస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలో జరిగే బోనాలు, ఆపై వచ్చే వినాయక చవితి ఉత్సవాలు వీరి టార్గెట్ అయి ఉండవచ్చని, ఆ సమయంలో భారీ విధ్వంసం సృష్టించేలా పథకాలకు వీరు రూపకల్పన చేస్తున్నారని ఎన్ఐఏ విచారణలో వెలుగుచూసినట్టు తెలుస్తోంది. జనసమ్మర్దం తక్కువగా ఉన్నా, ఐటీ కంపెనీలపై దాడులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చన్నది వీరి పన్నాగం. దాడులు పూర్తయి తప్పించుకోగలిగితే, విదేశాలకు పారిపోవాలని కూడా ప్లాన్ వేసుకున్నారు. మొత్తం ప్లాన్ మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ నేతృత్వంలో సాగుతోందని, ముఠా సభ్యులంతా నిత్యమూ మూడు కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. విదేశాల్లోని అగ్రనేతలతో సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ ద్వారా మాట్లాడుతూ, వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.