: కుంబ్లే రెండు గంటలు కూర్చున్నాడు... బ్యాంకాక్ వెళ్లిన నువ్వా నన్ననేది?: రవిశాస్త్రిపై విరుచుకుపడ్డ గంగూలీ
"భారత జట్టుకు క్రికెట్ కోచ్ బాధ్యతలంటే సామాన్యం కాదు. అలాంటి పదవికి ఇంటర్వ్యూ అంటే బ్యాంకాక్ నుంచి హాజరు కావడమేంటి? కమిటీలో ఉన్నది నేను ఒక్కడినేనా. ఇండియన్ క్రికెట్ లో గొప్ప వాళ్లున్న కమిటీ. సమకాలీకుడైన దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే మా ముందు రెండు గంటల పాటు కూర్చుని మాట్లాడాడు. ఇప్పుడు మేం నిర్వహించిన బాధ్యతలను పదేళ్ల క్రితమే చేపట్టి, మాకు మార్గదర్శకంగా నిలవాల్సిన వ్యక్తి పరిణతి లేకుండా విమర్శించడం ఏంటి? బీసీసీఐ కమిటీల్లో 20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు" అని తనను విమర్శించిన రవిశాస్త్రిపై కాస్త ఆలస్యంగానైనా సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు. తాను అమర్యాదకరంగా ప్రవర్తించినట్టు శాస్త్రి చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, ఇంటర్వ్యూ రోజు ఏం జరిగిందో బీసీసీఐ పెద్దలకు తెలుసునని అన్నాడు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలూ తన వద్ద ఉన్నాయని, అనుమతిస్తే వాటిని బయట పెట్టేందుకు అభ్యంతరం లేదని తెలిపాడు. నేరుగా హజరు కావాల్సిన ముఖ్యమైన ఇంటర్వ్యూను రవిశాస్త్రి తేలికగా తీసుకున్నాడని, ఇప్పటికైనా తన హోదాకు తగ్గట్టు ప్రవర్తించి పెద్దరికాన్ని నిలుపుకోవాలని హితవు పలికాడు. కాగా, కోచ్ గా అనిల్ కుంబ్లే ఎంపిక సరైనదేనని సంజయ్ మంజ్రేకర్, గౌతమ్ గంబీర్ లు వ్యాఖ్యానించగా, కుంబ్లే కన్నా రవిశాస్త్రిని ఎంపిక చేసి వుండాల్సిందని బిషన్ సింగ్ బేడీ అన్నాడు.