: ప్రత్యేక కోర్టు ఆవరణలోకి ప్రధాన కోర్టు!... హైదరాబాదులో సీబీఐ కోర్టుకు స్థాన చలనం!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన సీబీఐ కోర్టుకు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం నాంపల్లిలోని హైదరాబాదు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో సీబీఐ కోర్టు ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తదితరుల కేసుల విచారణ కోసమంటూ నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదురుగా ఉన్న గగన్ విహార్ భవనంలోని 12 అంతస్తులో సీబీఐ రెండో అదనపు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. తాజాగా ఈ రెండో అదనపు కోర్టు ఆవరణలోకే సీబీఐ ప్రధాన కోర్టు తరలివచ్చింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలతో నిన్న ప్రధాన కోర్టు సామగ్రిని సిబ్బంది ప్రత్యేక కోర్టులోకి చేర్చారు. రెండో అదనపు ప్రత్యేక కోర్టులోనే ప్రధాన కోర్టుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నేటి నుంచి ప్రధాన కోర్టు న్యాయమూర్తి ఇక్కడి నుంచే ఆయా కేసుల వాదనలను వింటారు. హైకోర్టు తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో హైదరాబాదులో సీబీఐ కోర్టు విభాగాలన్ని ఒకే చోటుకి చేరినట్లైంది.