: లాటరీ తగిలిందంటే నమ్మి... రూ. 11 లక్షలు కట్టి.. ప్రాణాలు తీసుకున్న టెక్కీ భార్య!
పాలక్... బెంగళూరులో ఓ పేరున్న సాఫ్ట్ వేర్ సంస్థలో సీనియర్ ఐటీ ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న ఉద్యోగి భార్య. మంచి జీతం, మంచి జీవనం, ముచ్చటైన సంసారం. ఆనందంగా ఉన్న వారి కాపురంలో సైబర్ నేరగాళ్లు చిచ్చు పెట్టారు. ఫలితం, వంచనకు గురైన ఆమె తన ప్రాణాలను బలవంతంగా తీసుకుంది. బెంగళూరులోని స్వామీ వివేకానంద రోడ్డులో కలకలం రేపిన ఘటనలో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పాలక్ కు ఓ రోజు రూ. 45 లక్షలు ప్రైజ్ మనీ వచ్చిందని, దీన్ని క్లయిమ్ చేసుకునేందుకు తమను సంప్రదించాలని మెసేజ్ వచ్చింది. దాన్ని గుడ్డిగా నమ్మిన పాలక్, వారిచ్చిన నెంబరుకు కాల్ చేస్తే, డబ్బు తీసుకోవాలంటే తమకు కొంత మొత్తాన్ని సుంకాల కింద చెల్లించాల్సి వుంటుందని చెప్పారు. వారి మాటలను నమ్మిన ఆమె పలుమార్లు రూ. 11 లక్షల వరకూ వారు చెప్పిన వివిధ ఖాతాల్లో జమ చేస్తూ వచ్చింది. ప్రైజ్ మనీ తీసుకునేందుకు ఢిల్లీ రమ్మంటే వెళ్లింది. అక్కడికి వెళ్లిన తరువాత కూడా చివరిగా మరికొంత డబ్బు కట్టాలంటే, తన వద్ద ఇంకేమీ మిగల్లేదని వేడుకుంది. అయితే, ప్రైజ్ మనీ రాదని వారు చెప్పడంతో, అప్పటికిగాని తాను మోసపోయినట్టు ఆమెకు అర్ధం కాలేదు. ఉసూరుమంటూ ఇంటికి తిరిగి వచ్చిన ఆమె, పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా, భర్త, పిల్లలు అడ్డుకున్నారు. ఆ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాలని సిద్ధమవుతున్న వేళ, తన గదిలో ఉరేసుకుని పాలక్ మరణించింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె అత్యధికంగా ఓ సారి రూ. 2.5 లక్షలు చెల్లించిందని, ఆమె డబ్బు జమ చేసిన ఖాతాల వివరాలు తీసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని వివరించారు.