: భాగ్యనగరిలోకి ప్రవేశించిన ఐఎస్ ముష్కరులు?... ఎన్ఐఏ అదుపులో ఆరుగురు ఉగ్రవాదులు?
ప్రపంచ వ్యాప్తంగా పెను విధ్వంసానికి పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా భాగ్యనగరి హైదరాబాదులో దాడులు చేసేందుకు ప్రణాళికలు రచించారు. అంతేకాకుండా పక్కా ప్లాన్ తో వారు హైదరాబాదులోకి ప్రవేశించారు. ఇంటెలిజెన్స్ నుంచి ఈ మేరకు కీలక సమాచారం అందుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగిపోయారు. హైదరాబాదులోని పాతబస్తీలో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆరుగురు ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులు ఎన్ఐఏ అధికారులకు పట్టుబడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పాతబస్తీలోని రహస్య స్థావరాల్లో తలదాచుకున్న ఆ ఆరుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు వారి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పథకం రచించినట్లు సోదాల సందర్భంగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరింత మంది బలగాలను రంగంలోకి దించిన ఎన్ఐఏ... పాతబస్తీలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మర సోదాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.