: క్వార్టర్ ఖాళీ చేయాలన్న టీ సర్కారు!... కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న ఏపీ సర్కారు!
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదం రేగింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని ప్రభుత్వ క్వార్టర్ లో ఉంటున్న ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ తక్షణమే దానిని ఖాళీ చేయాలని తెలంగాణ సర్కారు నాలుగు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఏపీ సర్కారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా తెలంగాణ సర్కారు వైఖరిపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఏపీ నిర్ణయించింది. తెలంగాణ సర్కారు నోటీసులు విభజన చట్టానికి విరుద్ధమని పేర్కొన్న ఏపీ... సదరు నోటీసును తీవ్రంగా పరిగణించింది. గతంలోనూ ఈ తరహాలోనే తెలంగాణ సర్కారు నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయనుంది.