: కారు కొనేందుకు డబ్బు ఇవ్వలేదని దాడి!... వీడిన వైసీపీ గుంటూరు మహిళా నేత ‘ఇంటి’గుట్టు!
తన ఇంటికి రావడమే కాకుండా తనపై అత్యాచారానికి యత్నించాడని సాటి జడ్పీటీసీపై నిందారోపణలు మోపిన గుంటూరు జిల్లా పరిషత్ వైసీపీ ఫ్లోర్ లీడర్ రేవతి ఆరోపణలు అవాస్తమని తేలిపోయాయి. మొన్న రాత్రి గుంటూరు పరిధిలోని మణిపురంలోని రేవతి ఇంటి సమీపంలో గాయాలతో పడి ఉన్న వీరనారాయణ ప్రస్తుతం జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రేవతి ఇంటిలో అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆయన నిన్న పోలీసులతో పాటు మీడియా ప్రతినిధులకు సవివరంగా వెల్లడించారు. వీరనారాయణ చెప్పిన వివరాల మేరకు... రేవతి అప్పటికే పలువురి వద్ద పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారు. అయితే ఆ అప్పుల చెల్లింపునకు సంబంధించి ఆమె సరిగ్గా వాయిదాలు చెల్లించడం లేదు. ఇదే విషయం జడ్పీటీసీల మధ్య జరిగిన చర్చల్లో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో సోమవారం రేవతి తన కారులో స్వయంగా వీరనారాయణ ఇంటి వద్దకు వచ్చి ఆయనను కారులో కూర్చోబెట్టుకుని ఆటో నగర్ లోని ఫోర్స్ కారు షోరూంకు తీసుకెళ్లారు. అక్కడ మదన్ అనే వ్యక్తితో మాట్లాడి కారు వివరాలు తెలుసుకున్నారు. ఆమె అడిగిన కారు విలువ దాదాపుగా రూ.10.5 లక్షలు. ఆ మొత్తాన్ని ఇవ్వాలని వీరనారాయణకు రేవతి చెప్పారు. అయితే రేవతి అప్పుల విషయం తెలిసిన వీరనారాయణ అందుకు నిరాకరించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో బంధువుల ఇంటిలో ఉన్న వీరనారాయణను రేవతి పిలుస్తున్నారంటూ ఆమె కారు డ్రైవర్ తీసుకెళ్లాడు. ఒంటరిగా వెళ్లిన వీరనారాయణను రేవతి సమక్షంలోనే ఆమె నలుగురు అనుచరులు విచక్షణారహితంగా కొట్టారు. ఆ తర్వాత ఓ ఛానెల్ ప్రతినిధిని పిలిపించి... మంత్రి రావెల కిశోర్ బాబు వేధిస్తున్నారంటూ చెప్పాలని వీరనారాయణపై ఒత్తిడి చేశారు. అందుకు నిరాకరించిన వీరనారాయణపై మరోమారు దాడి చేసి బయట పడేశారు.